పోలింగుకు ముందే కూటమి సత్తా
- పలు మున్సిపాలిటీలు ఏకగ్రీవం
ఆంధ్రాలో ఈరోజు – అమరావతి
పుర పోరులో పోలింగుకు ముందే రాష్ట్రంలో కూటమి సత్తా చాటింది. పలు మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఏకగ్రీవమైన అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నుంచి డిక్లరేషన్ అందుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీని టీడీపీకి కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్‌గా నంద్యాల రాఘవరెడ్డితో పాటు తెలుగుదేశానికి చెందిన 52 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారందరికీ మున్సిపల్ కార్యాలయంలో డిక్లరేషన్లు ఇచ్చారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పట్టుదలతో పని చేస్తామని చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న రాఘవరెడ్డి తెలిపారు.
కడప నగరపాలక ఎన్నికల్లో 50 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. టీడీపీ 47, బీజేపీ 2, జనసేన ఒక డివిజన్లో ఏకగ్రీవం అయ్యాయి. మేయర్ సహా 16 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. బద్వేల్ మున్సిపల్ పీఠాన్ని తెలుగుదేశం కైవసం చేసుకుంది. ఛైర్‌పర్సన్‌గా సోమేసుల దివ్యతేజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మైదుకూరు మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠం టీడీపీ వశమైంది. ఛైర్మన్‌గా ధనపాల జగన్మోహన్ ఏకగ్రీవమయ్యారు. ఆళ్లగడ్డ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా షేక్ అనీషా(టీడీపీ)తో పాటు 32 వార్డులను తెలుగుదేశం కైవసం చేసుకుంది.
కమలాపురం నగర పంచాయతీ కూడా టీడీపీ కైవసం చేసుకుంది. ఛైర్‌పర్సన్‌గా స్వప్నతో పాటు 22 మంది టీడీపీ, ఒక బీజేపీ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజంపేట మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా తెలుగుదేశానికి చెందిన దొంతం గాయత్రి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పీఠం బీజేపీ ఖాతాలో పడింది. ఛైర్‌పర్సన్‌గా గోర్ల మధులత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 27 వార్డుల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. ఎర్రగుంట్లలో ఒక వార్డుకు మాత్రమే ఎన్నిక జరగనుంది. పులివెందుల మున్సిపాలిటీలో 20 వార్డులు టీడీపీ కైవసం చేసుకుంది. ఛైర్పర్సన్ సహా మరో 20 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ ఛైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి తంగెళ్ల శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాచేపల్లిలో ఛైర్మన్‌తో పాటు 28వార్డుల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. గురజాల నగర పంచాయతీ ఛైర్మన్‌గా తెలుగుదేశానికి చెందిన నేలవల్లి బొల్లయ్యతో పాటు 23 వార్డుల్లో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవంగా గెలుపొందారు. పిడుగురాళ్ల మున్సిపాలిటీపై కూడా టీడీపీ జెండా ఎగిరింది. తెలుగుదేశానికి చెందిన బాబావలి ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. 40కి 40 వార్డులకు కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిలకలూరిపేట 48 వార్డుల్లో 16 వార్డుల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవం కాగా పురపాలక ఛైర్పర్సన్ బరిలో ఐదుగురు అభ్యర్థులు ఉన్నారు.
ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ జనసేన కైవసం చేసుకుంది. ఛైర్‌పర్సన్‌గా దారం సుబ్బారావుతో పాటు 28 వార్డుల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కనిగిరి మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగిరింది. ఛైర్‌పర్సన్‌గా తిరుపతమ్మతో పాటు 30 మంది కౌన్సిలర్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.
అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మున్సిపాలిటీలో 48 వార్డులకు 30 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 37వ వార్డు కౌన్సిలర్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు.
ఆత్మకూరు మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్‌గా గోవిందరాజులు(టీడీపీ)తో పాటు 32 వార్డులకు 27 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాలిటీని తెలుగుదేశం కైవసం చాటింది. రాయచోటి ఛైర్మన్‌గా బోనమల ఖాదర్‌వలి(టీడీపీ)తో పాటు 44 వార్డుల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీలోని నాలుగు వార్డుల్లో టీడీపీకి చెందిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2 మున్సిపాలిటీలను తెలుగుదేశం కైవసం చేసుకుంది. పుంగనూరు మున్సిపాలిటీ ఛైర్పర్సన్ నయామ్తాజ్(టీడీపీ) 32 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. నగరి మున్సిపాలిటీ ఛైర్పర్సన్ సహా 3 వార్డులకు ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నికయ్యారు. నగరి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా శ్రీనివాసన్(టీడీపీ) విజయం సాధించారు.చిత్తూరు నగరపాలిక సంస్థ ఎన్నికల్లో 51 డివిజన్లు, కుప్పం మున్సిపాలిటీలో 13 వార్డులను తెలుగుదేశం కైవసం చేసింది.



