దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుపాను
- ఏపీలో అత్యంత భారీ వర్షాలు
ఆంధ్రాలో ఈరోజు – విజయవాడ
తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం స్థిరంగా కదులుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 8 కిలో మీటర్ల వేగంతో పయనిస్తోంది. ప్రస్తుతం విశాఖకు 820 కిలోమీటర్లు, కాకినాడకు 910 కిలో మీటర్లు, మచిలీపట్నానికి 1010 కిలోమీటర్లు, బాపట్లకు 1080 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. తీవ్ర వాయుగుండం సోమవారానికి తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈనెల 27న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా, 28 ఉదయానికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది అదే రోజు మధ్యాహ్నానికి బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా కొన్ని సందర్భాల్లో వాటి వేగం 140 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని చెప్పారు. ఈ మేరకు వివిధ జిల్లాల్లో 7 ఎన్డీఆర్ఎఫ్, 8 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. సోమవారం రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు మంగళ, బుధవారాల్లో కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ తుపానుకు బంగ్లాదేశ్ సూచించిన అర్నబ్ పేరు పెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఈ క్రమంలోనే తుపాను కారణంగా రాష్ట్రంలో అత్యంత భారీ, అతి భారీ, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈనెల 27న ఆయా చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. తద్వారా 20 సెంటిమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా అతి భారీ వర్షాల వల్ల 20 సెంటిమీటర్లులోపు వర్షపాతం, భారీ వర్షాలు 5 సెంటిమీటర్ల నుంచి 12 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
ఈనెల 27న కాకినాడ, కోనసీమ, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. వైఎస్సార్ కడప, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, అనంతపురం జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు.
ఈనెల 28న విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ , తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. వైఎస్సార్ కడప, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, అనంతపురం జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. ఆయా చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. తద్వారా 20 సెంటిమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా అతి భారీ వర్షాల వల్ల 20 సెంటిమీటర్లులోపు వర్షపాతం, భారీ వర్షాలు 5 సెంటిమీటర్ల నుంచి 12 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
- తుపానుపై చంద్రబాబు సమీక్ష
అర్నబ్ తుపాను ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ నెల 28న బాపట్ల, విశాఖ మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉండటంతో ముందస్తు సన్నద్ధతపై సీఎం సమీక్షించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, జిల్లా కలెక్టర్లు, ఆర్టీజీఎస్ అధికారులు, వ్యవసాయం, విద్యుత్, ఇరిగేషన్, హోం, వైద్య ఆరోగ్య, పౌర సరఫరాలు, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించడం, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు ఆదేశాలిచ్చారు. సహాయక చర్యల కోసం 10 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు.
బంగాళాఖాతంలో తుపాను పొంచి ఉన్న వేళ రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత ఆదేశించారు. రానున్న ఐదు రోజులు ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోమవారం వర్షాలు ప్రారంభమై మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగులను వెంటనే తొలగించాలని అధికారులకు అనిత ఆదేశాలిచ్చారు.
అవసరమైతే తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని, సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని అనిత తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, బీచ్లలోకి పర్యాటకులను అనుమతించ వద్దని సూచించారు. భారీగా అలలు ఎగసిపడే ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సోషల్ మీడియాలో వచ్చే వదంతులను వ్యాప్తి చేయవద్దని సూచించారు.
తుపాను దృష్ట్యా విద్యుత్ శాఖ అధికారులతో మంత్రులు అనిత, గొట్టిపాటి రవికుమార్ సమీక్షించారు. డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లు, జిల్లా అధికారులతో వారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగులను వెంటనే తొలగించాలన్నారు.



